ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. మంత్రిగా కూడా పనిచేశారు. అయినా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. ఎమ్మెల్యే అసమర్థతకు నిలువుటద్దంలా నిలిచింది వనపర్తి. ఎమ్మెల్యే పదవిని రాజకీయ అవకాశంగా చూసుకున్నారే తప్ప.. గెలిపించినప్రజలకు ఏమీ చేయలేదు. వారి బాగోగులు పట్టించుకోలేదు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి పాలనలో వనపర్తి ప్రజలు విలవిలలాడి, వలవల ఏడ్చారు.
కాంగ్రెస్ పాలనలో మోసపోయిన ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించారు. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి జై కొట్టారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయలేదు. ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యంతో నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తెప్పించారు. వనపర్తిని వడివడిగా ప్రగతిబాట పట్టించారు. ఈ ఐదేండ్లలో వనపర్తి రూపురేఖలే మారిపోయాయి.
వనపర్తి నుంచి కాంగ్రెస్ తరఫున జి.చిన్నారెడ్డి 1989, 99, 2004, 2014 ఎన్నికల్లో గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఇది ఆయనకు మంచి అవకాశం. కానీ, ఈ అవకాశాన్ని ఆయన ప్రజల బాగు కోసం ఉపయోగించుకోలేదు. ఆయన నిర్లక్ష్యం ఫలితంగానే అభివృద్ధికి నోచుకోలేదు. 2014 ఎన్నికల్లో వనపర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన నిరంజన్‌రెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ నియమించారు. సీఎంతో కలిసి పని చేసేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని నిరంజన్‌రెడ్డి రాష్ర్టాభివృద్ధితో పాటు వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగించుకున్నారు.

Wnp Intigrated Market
లక్ష ఎకరాలకు సాగునీరు
వనపర్తి కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. కేఎల్ఐ, భీమా ద్వారా నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. పండించిన పంటను రైతులు అమ్ముకునేందుకు వీలుగా రూ.44 కోట్లతో వ్యవసాయ మార్కెట్ యార్డును నిర్మించింది. వనపర్తికి ఐటీ ఇండస్ట్రీని తీసుకురావాలనే లక్ష్యంతో ఐటీ టవర్‌ను కూడా నిర్మిస్తున్నది. రూ.62 కోట్ల వ్యయంతో సమీకృత కలెక్టరేట్ భవనం, రూ.25 కోట్లతో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని నిర్మించింది. రూ.184 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించింది. 400 పడకల ప్రభుత్వ దవాఖానను తీసుకువచ్చి ప్రజలకు సర్కారు వైద్యాన్ని చేరువ చేసింది. వనపర్తి పట్టణంతో పాటు అన్ని గ్రామాల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులను కేటాయించింది. ప్రధాన పట్టణాలను మున్సిపాలిటీలుగా మార్చింది. మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది. ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నది.
వనపర్తి నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచిని గుర్తించి గత ఎన్నికల్లో ప్రజలు నిరంజన్ రెడ్డికి భారీ మెజారిటీతో విజయాన్ని కట్టబెట్టారు. ఆయన పనితనాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రిగా నిరంజన్‌రెడ్డి ఐదేండ్లలోనే వనపర్తి రూపురేఖలు మార్చేశారు. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందుంచి ప్రజాతీర్పు కోరుతూ ఈ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.


P