ఖిలావరంగల్ : ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కనీస అవసరాలు కూడా తీరక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సాగు, తాగు నీరు లేక, ఎరువులు పురుగుల మందులు అందక ఇబ్బంది విషయం తెలిసందే. వీటికి తోడు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్ల మీద ప్రయాణం నరకప్రాయంగా మారింది. చిన్న గుంతలను కూడా ప్రభుత్వం పూడ్చలేకపోతున్నది. చివరికి ప్రమాద హెచ్చరిక బోర్డులు సతం పెట్టలేని దురవస్థను చూసి ప్రయాణికులే పాత చీరలు, సంచులను హెచ్చరిక బోర్డులుగా పెట్టిన సంఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది.
ప్రమాదాల నివారణకు పాత చీరలే..
వివరాల్లోకి వెళ్తే…వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ప్రధాన రహదారి దారుణంగా దెబ్బతినడంతో ((Road damaged) ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు గుంతలమయంగా మారి వర్షం నీరు నిలుస్తుంది. దీంతో గుంతలు కనపడక వాహనదారులు కింద పడి గాయాల పాలవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో స్థానికులు తాత్కాలికంగా ఒక చీరను, చెత్త సంచులను అడ్డుగా పెట్టి ప్రమాద హెచ్చరికను ఏర్పాటు చేశారు. ఈ విషయం ఇప్పుడు వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
స్థానికుల కథనం ప్రకారం.. ఈ రోడ్డుపై గత కొన్ని రోజులుగా తాగునీటి పైప్‌లైన్ లీక్ అవడం వల్ల నిరంతరంగా నీరు ప్రవహిస్తోంది. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలు ఈ ప్రాంతాన్ని మరింత అస్తవ్యస్థం చేశాయి. రోడ్డుపై మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు, వృద్ధులు, మహిళలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా బైక్‌పై వెళ్తున్న పలువురు కిందపడి గాయపడ్డారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇదే రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పటికి ఈ సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెత్త సంచులను అడ్డుగా కట్టి..
అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులు పడుతున్న కష్టాలను గమనించిన స్థానికులు మానవతా దృక్పథంతో తాత్కాలికంగా పరిష్కారం కల్పించారు. రహదారి మధ్యలో పాత చీరను, చెత్త సంచులను అడ్డుగా కట్టి గుంతల ఉనికిని సూచించారు. వారి ఈ ప్రయత్నాన్ని అటుగా వెళ్లే వాహనదారులు అభినందించారు.
స్థానికులు, తాగునీటి పైప్‌లైన్ లీక్‌ను తక్షణమే సరిచేయాలని, రోడ్డుకు మరమ్మతులు చేసి ప్రజల కష్టాలను తొలగించాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు. అలాగే ఈ సమస్యపై అధికార యంత్రాంగం త్వరగా స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.