హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌కు ఘాటుగా సమాధానమిచ్చిన బీఆర్ఎస్ కార్యకర్త మేకల నర్సింగ్‌రావుకు అండగా ఉంటామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. నర్సింగ్పై థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన పోలీసులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, పేర్లు రాసుకొని మరీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు నమోదు చేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రోహిత్ తన వయస్సును మరిచిపోయి కేసీఆర్‌పై అడ్డగోలు దూషణలకు దిగడాన్ని తట్టుకోలేక ధీటుగా సమాధానమిచ్చిన నర్సింగ్‌ను కేటీఆర్ అభినందించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నర్సింగ్‌ను మెదక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్రమంగా నిర్బంధించి థర్డ్‌డిగ్రీ ప్రయోగిస్తూ ఫోన్లో ఎమ్మెల్యేకు వినిపించడం హేయనీయమని ఖండించారు. ఇలాంటి అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగే అధికారులను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని పునరుద్ఘాటించారు. వీరి అరచకాలపై కోర్టుల్లో కేసులు వేసి బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. నర్సింగ్ లాంటి కార్యకర్తలు నియోజకవర్గానికి పదిమంది చొప్పున ఉంటే కాంగ్రెస్ కుట్రలు సాగవని, నర్సింగ్ చికిత్సకు పార్టీ ఆర్థిక సహాయం చేస్తుందని, వారి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.