హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): పాలమూరు ఎత్తిపోతల పథకం ఆలస్యం కావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని, ఆ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేస్తూ అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. ఓ వైపు ప్రాజెక్టును అడ్డుకుంటూనే మరోవైపు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ సభలో ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి అడ్డంకులు సృష్టించకుంటే ఈ పాటికే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తయ్యేవని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయని చెప్పారు. ఇక అధికారంపై కాంగ్రెస్ పార్టీవి పగటికలలేనని ఎద్దేవా చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు కూడా సాగు నీళ్లు అందేవి కావని, తెలంగాణ వచ్చాక కేసీఆర్ నాయకత్వంలో నేడు 11 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతున్నదని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తయితే రాబోయే రెండేండ్లలో 23-24 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు.
ఉమ్మడి జిల్లాలో 13 లక్షల మంది రైతుబంధు ద్వారా లబ్ధిపొందుతున్నారని, 4 లక్షల మందికి ఆసరా, ఇతర పథకాల ద్వారా లబ్ధి చేకూరుతున్నదని పేర్కొన్నారు. కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణతో ధరలు పెరిగి పేద, మధ్య తరగతి కుటుంబాల బతుకులు ఆగమైతుంటే జాతీయ పార్టీగా కాంగ్రెస్ పోషించిన పాత్ర ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ విఫలం కావడంతో ఆ పాత్రను సీఎం కేసీఆర్ పోషిస్తున్నారని, కేంద్రంపై, బీజేపీపై పోరాడుతున్నారని చెప్పారు. కేసీఆర్ పోరాడి తెచ్చిన తెలంగాణకు తూట్లు పొడవడం, కేసీఆర్‌పై నిత్యం నిందలు వేసే పనిలోనే కాంగ్రెస్ నిమగ్నమై ఉందని విమర్శించారు.