హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): దేశంలో పెచ్చరిల్లుతున్న అవినీతి, అన్యాయం, అప్రజాస్వామిక, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, వామపక్షవాదులు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా పిలుపునిచ్చారు. ఒక రాజకీయ పార్టీ వందేండ్లు పూర్తి చేసుకోవడం సాధారణ విషయం కాదని, సీపీఐ తన వందేండ్ల ప్రస్థానంలో భారత స్వాతంత్య్ర ఉద్యమం నుంచి ఇప్పటివరకు అనేక త్యాగాలు, వీరోచిత పోరాటాలు, తెగింపు ఉన్నాయని వివరించారు. సీపీఐ శత వార్షికోత్సవాలను ఈ ఏడాదిపాటు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులను కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్‌పై దిగజారి మాట్లాడినందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా రాజీనామా చేసేవరకు కలిసికట్టుగా ఉద్యమించాలని కోరారు. సీపీఐ శత వార్షికోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌లో పార్టీ పతాకాన్ని అజీజ్‌పాషా ఆవిషరించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, కే శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. అంతరాలు లేని సమసమాజం కోసం అందరూ పునరంకితం కావాలని చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో ఏ ఒక రాజకీయ పార్టీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని కే శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తేతెలంగాణ): సీపీఐ-ఎంఎల్ న్యూడెమోక్రసీ రెండు పార్టీల విలీనంపై చంద్రం ముఠా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, కుట్రలను తిరస్కరించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రెండు న్యూడెమోక్రసీల విలీనం కాదని, ఎస్వీ ముఠా యతీంద్రకుమార్ ముఠాతో విలీనం అవుతుందంటూ చంద్రం చేసిన వ్యాఖ్యలను ఆయన గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. చంద్రన్నకి విప్లవ జీవితంతోపాటు విప్లవేతర జీవితం ఉన్నదని, తన అక్రమాస్తుల రక్షణలో భాగంగా నాదెండ్ల బ్రహ్మయ్య హత్య జరిగిందని ఆరోపించారు. చంద్రం నాయకత్వాన్ని రెండు రాష్ర్టాల మెజార్టీ నాయకత్వం తిరస్కరించిందని చెప్పారు. డిసెంబర్ 28న రెండు విప్లవ సంస్థలు విలీనం అవుతున్నాయని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తేతెలంగాణ): ‘నూరు సంవత్సరాల క్రితం వెలిగించి, భారత స్వాతంత్య్ర పోరాటంలో భాగ మై, ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి, పాలనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన సీపీఐ విప్లవ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిందని, అలాంటి పార్టీలో తానూ భాగమైనందుకు గర్విస్తున్నా’ అని ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి కార్యకర్తకు రెడ్ సెలూ ్యట్ అని పేర్కొన్నారు. సీపీఐ శబాబ్ది ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఖమ్మం జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలో సూత్రప్రాతిపదికన వామపక్షాల ఐక్యతకు ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేద్దామని, ఎర్రజెండాను ముందుకు తీసుకుపోదామని పిలుపునిచ్చారు.