OU | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులు తమ ఉద్యోగ భద్రతకై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓయూ పరిపాలన భవనం రెండవ గేటు ముందు వంటావార్పు నిర్వహించిన అనంతరం ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పబడుతున్న పాలనలో తరగతి గదిన బోధించే యూనివర్సిటీ అధ్యాపకులు రోడ్లపైన వండుకుని తినే స్థితిలోకి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ఏళ్లుగా వర్సిటీ యాజమాన్యం తమను శ్రమదోపిడికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 21లో సైతం తమకు కనీస వెయిటేజ్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అతి తక్కువ వేతనానికి పనిచేసి, తమ విలువైన సమయాన్ని వెచ్చించిన పార్ట్ టైం అధ్యాపకులను రోడ్డు పాలు చేయాలని యోచిస్తున్న ఓయూ అధికారులు తమకు అందజేసే విలువైన బహుమతి ఇది అని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తాము చేస్తున్న ఆందోళనకు వివిధ ప్రజాసంఘాలు, పార్టీల నాయకులను, ప్రొఫెసర్లను ఆహ్వానించినట్లు వివరించారు. సుదీర్ఘకాలం ప్రభుత్వాలు అధ్యాపక భర్తీ చేయనందునే ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్స్ నెలకొన్నాయని, ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని వివరించారు. ఈ సమస్య పట్ల ప్రజా ఆందోళనలు మొదలయ్యే ముందే ప్రభుత్వం బాధ్యతగా మెదులుకోవాలని హితవుపలికారు. నాలుగో రోజు సమ్మెకు ప్రొఫెసర్ చింతాబట్ల శ్రీనివాస్, టిఎన్ఎన్ అధినేత పృధ్వీరాజ్ యాదవ్, వివిధ సంఘాల నాయకులు కాసం వెంకటేశ్వర్లు, రుద్రవరం లింగ స్వామి, గాదె వెంకట్, ఉదయ్, ప్రజాపతి సత్యనారాయణ, తదితరులు మద్దతు తెలుపారు.