Gurukula Entrance | హైదరాబాద్(నమస్తే తెలంగాణ)/లింగాల/చెన్నారావుపేట/అచ్చంపేట/ఖమ్మం అర్బన్, ఫిబ్రవరి 23: వార్షికాదాయం రూ.2 లక్షలకు మించకూడదనే నిబంధన ఆ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షకు ఈ నిబంధననే కొందరు విద్యార్థులకు అడ్డంకిగా నిలిచింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పరీక్షకు దూరమమవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. పలు పరీక్షా కేంద్రాల్లో సైతం ధర్నాకు దిగడంతో గురుకుల ప్రవేశ పరీక్ష గందరగోళం మధ్య జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలలో పది మంది విద్యార్థులకు ఓఎంఆర్ షీటు రాలేదు. నిర్వాహకులు వారిని పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేశారు. కొందరికి రూ.2లక్షలకు పైగా ఆదాయం, మరి కొంతమంది విద్యార్థులు కులధ్రువీకరణ పత్రాలు తప్పుగా ఉండడంతో వారికి ఓఎంఆర్ షీటు రాలేదని ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. గద్వాల, అచ్చంపేటకు చెందిన గోవింద్ సాయికిరణ్, నిక్కీ తిరుమలేశ్‌కు ఓఎంఆర్ షీట్ రాకపోవడంతో మన్ననూర్ రెసిడెన్షియల్ పాఠశాల సెంటర్ నిర్వాహకులు విద్యార్థులను బయటకు పంపించారు.
దీంతో తల్లిదండ్రులు మన్ననూర్ సెంటర్ ఎదుట గల ప్రధాన రోడ్డుపై బైఠాయించి అరగంటపాటు ధర్నా చేశారు. దీంతో శ్రీశైలం- హైదరాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా గొల్లభామ తండా గ్రామపంచాయతీ అడ్డబాటతండాకు చెందిన బోడ దివ్యశ్రీని చెన్నారావుపేటలోని సెంటర్లో, మోదుగు కృష్ణమనోహర్, ఎం ధీరజ్‌ను కూడా ఖమ్మం రూరల్ మండలంలోని ఎస్‌బీసీఈ కళాశాల కేంద్రంలో ఇదే నిబంధనతో పరీక్షకు అనుమతించలేదు.
దీంతో ఆయా కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 440 కేంద్రాల్లో నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్షకు 96శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. గతేడాది కన్నా ఈ ఏడాది అప్లికేషన్లే తక్కువరాగా, పరీక్షకు హాజరైన వారి శాతం సైతం తగ్గిపోయింది. 1,67, 662 మంది దరఖాస్తు చేసుకోగా, 1,61,618 మంది (96శాతం) విద్యార్థులే హాజరయ్యారు. ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ అలగు వర్షిణి ప్రకటనలో వెల్లడించారు.