హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీలో ఇకపై ప్రతినెలా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలను ఏర్పాటు చేస్తామని, సలహాలు, అభిప్రాయాలు స్వీకరిస్తామని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వెల్లడించారు. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ ఇంటర్ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన పరీక్షా ఫలితాలను మంత్రి శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో విడుదల చేశారు. సైనిక పాఠశాలలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ), నాన్-సీవోఈ, ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో ఫేజ్-1లో 18,401 సీట్ల భర్తీకి సంబంధించి విద్యార్థుల మెరిట్ జాబితాను ప్రకటించారు.
అనంతరం మంత్రి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ పేద, దళిత, గిరిజన, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను పూర్తి ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఫేజ్-1 ఇంటర్‌కు సంబంధించి 18,401 సీట్లు భర్తీ చేయనున్నామని, మిగిలిన 1,339 సీట్లను సెకండ్ ఫేజ్‌లో భర్తీ చేస్తామని వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులు జూన్ 7లోగా సంబంధిత కళాశాలల్లో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఓఎస్డీ వైజే విజయ్‌కుమార్, సొసైటీ కార్యదర్శి శారద, జాయింట్ సెక్రటరీ సక్రునాయక్, అసిస్టెంట్ సెక్రటరీ మధునాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ గురుకుల సొసైటీ పనివేళలను గతంలో మాదిరిగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలకు మార్చారు. ఈ మేరకు సొసైటీ సెక్రటరీ శారద శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని గురుకులాలకు కామన్ టైంటేబుల్ పేరిట సొసైటీల పనివేళలను గంట ముందుకు జరిపారు.ఉదయం 8 గంటలకే నిర్ధారించారు. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పోరాటం ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చింది. టైంటేబుల్‌ను తిరిగి గతంలో మాదిరిగా సవరించారు.