సైదాపూర్, డిసెంబర్ 25: అల్లారుముద్దుగా పెంచుకన్న కన్నబిడ్డను ఆ తల్లిదండ్రులే కడతేర్చారు. ఓ వివాహితుడి ప్రేమలో పడిందనే విషయం తెలిసి, తమ పరువు పోతుందనే భయంతో మైనర్ అయిన బాలికను హతమార్చారు. కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలను సైదాపూర్ పోలీస్స్టేషన్లో గురువారం హుజూరాబాద్ ఏసీబీ మాధవి మీడియాకు వెల్లడించారు. సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శివరాంపల్లికి చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని రెడ్డి అర్చన (16) అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత యువకుడి ప్రేమలో ఉన్నట్టు తల్లిదండ్రులు రాజు, లావణ్య అనుమానించారు. తమ పరువు పోతుందన్న భయంతో అర్చనను కడతేర్చాలని నిర్ణయించారు.
ఈ మేరకు మందస్తు పథకం ప్రకారం.. గత నెల 14న రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో అర్చనకు బలవంతంగా పురుగుల మందు తాగించారు. అయినా, బాలిక చనిపోకపోవడంతో తండ్రి ప్రాణాలిడిసే దాకా గొంతునులిమాడు. మరునాడు తన కూతురు నోట్లో నుంచి నురుగలు వచ్చాయని, అనారోగ్య సమస్యలతో మృతిచెందిందని బాలిక తండ్రి రాజు సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరిట బాలికను వేధించినట్టు విచారణలో తెలిసింది. సంఘటనపై అనుమానం రావడంతో బాలిక తల్లిదండ్రులను విచారించగా జరిగిన విషయాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఈ మేరకు నిందితులైన అర్చన తల్లిదండ్రులు రెడ్డి రాజు, లావణ్యను తాజాగా అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సమావేశంలో హుజూరాబాద్ రూరల్ సీఐ వెంకట్, సైదాపూర్ ఎస్ఐ తిరుపతి పాల్గొన్నారు.