SIR Enumeration | న్యూఢిల్లీ, జూలై 12: ఎన్నికల జాబితాలో తమ పేర్లను కొనసాగించుకోవడానికి గత ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో నమోదు కాని ప్రస్తుత ఓటర్లే కాకుండా, ఓటర్ల జాబితాలోకి కొత్తగా చేరాలని కోరుకునే దరఖాస్తుదారులు కూడా తమ తల్లిదండ్రులకు సంబంధించిన ‘సర్’ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికల సంఘం.. కొత్త ఓటర్ల నమోదుకు సమర్పించే ఫామ్ పూర్తి సందర్భంగా దరఖాస్తుదారులు తమ తల్లిదండ్రుల ‘సర్’ వివరాలతో ఒక డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బీహార్లో గత ఏడాది చేపట్టిన ‘సర్’ కార్యక్రమంలో దీనిని చేర్చారు. ఫామ్ 6లో ఎలాంటి మార్పులు చేర్చకపోయినా డిక్లరేషన్ను ప్రత్యేకంగా సమర్పించడం తప్పనిసరి చేసినట్టు బీహార్ ఎన్నికల అధికారులు తెలిపారు.
ఇది ఓటర్లను మ్యాపింగ్ చేయడానికి సహాయపడుతుందని, అంతేకాక, కొత్త ఓటర్లు తమ దరఖాస్తుతో ఎక్కువ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం తగ్గుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఆన్లైన్లో ఫామ్ 6 సమర్పించినప్పుడు కూడా డిక్లరేషన్ను పూర్తి చేసేవరకు దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాదని అధికారులు స్పష్టం చేశారు.