హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆడపిల్లలపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో చైతన్యవంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ప్రోత్సాహకాలను అందిస్తున్నా పూర్తిగా తగ్గనే లేదు. అత్యాధునిక సమాజం ఉన్న 21వ శతాబ్దంలోనూ ఈ వివక్ష కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అమ్మాయి తక్కువ, అబ్బాయి ఎక్కువ అనే భావన ఇంకా తొలగిపోలేదు. ఇలాంటి లింగవివక్ష నుంచి మన సమాజం బయట పడటంలేదు. మనలో ఎందరో తల్లిదండ్రులు మగ పిల్లలను ప్రైవేట్ బడికి, ఆడపిల్లలను సర్కారు బడికి పంపుతూ వివక్ష చూపుతున్నారు.
మగ పిల్లలను పైసలు పెట్టి చదివిస్తుండగా, ఆడపిల్లలను ఉచిత చదువులే ఎక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆందోళన కలిగించే ఈ విషయం తాజా విద్యాశాఖ గణాంకాల ద్వారా స్పష్టమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్న తేడాల్లేకుండా అంతా ఇదే వివక్షను ప్రదర్శిస్తున్నారని తేలింది. ఇలా ఇంటిలోనే లింగవివక్షకు పునాదులు పడుతుండటం ఆందోళనకరం.
రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లల్లో మొత్తం 36.93 లక్షల మంది విద్యార్థులు ఉంటే 20.05 లక్షల మంది బాలురు చదువుతున్నారు. అదే బాలికలు కేవలం 16.88 లక్షల మంది మాత్రమే చదువుతున్నారు. దాదాపు 3.5 లక్షల మంది బాలురు ప్రైవేట్ స్కూళ్లల్లో అధికంగా ఉన్నారు. అదే సర్కారు బడులన్నీ కలిపితే 25.08 లక్షల మంది విద్యార్థులు ఉంటే అబ్బాయిలు 11.64 లక్షల మంది, అమ్మాయిలు 13.43 లక్షల మంది చొప్పున ఉన్నారు. అంటే బాలురతో పోల్చితే బాలికలు 2.3 లక్షల మంది ఎక్కువగా సర్కారు బడుల్లో చదువుతున్నారు. ఈ ఒక్క లెక్క చాలు రాష్ట్రంలో లింగవివక్ష ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకునేందుకు.
తల్లిదండ్రుల ఆలోచనల్లో ఇంకా మార్పు రాకపోవడమే ఇందుకు ఓ కారణంగా చెప్పవచ్చు. పైగా ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న కుటుంబాలు ఫీజుల భారాన్ని మోయలేక ఒకరిని ప్రైవేట్‌కు, మరొకరిని సర్కారు బడులకు పంపిస్తూ నెట్టుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా గురుకులాల్లో అత్యధికంగా బాలికలే ఉండటం గమనార్హం.