School Teachers | ధర్మపురి, మే 16 : విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయులు పేరెంట్ టీచర్ సమావేశం సాక్షిగా కొట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూర్ జడ్పీహెచ్ఎస్లో చోటుచేసుకుంది. శుక్రవారం దోనూర్ జడ్పీహెచ్ఎస్లో పక్కనే ఉన్న ఎంపీపీఎస్‌కు కలిపి సంయుక్తంగా పీటీఏ సమావేశం నిర్వహించారు. దోనూర్ జడ్పీపాఠశాల హెచ్ఎం, ఎంఈవో సీతాలక్ష్మి బడిబాట తదితర అంశాలపై మాట్లాడారు.
సమావేశం అనంతరం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాఠశాల ఆరుబయట మాట్లాడుకుంటుండగా.. జడ్పీహెచ్ఎస్లో ఎస్జీటీగా పనిచేస్తున్న గడిపెల్లి మహేశ్, ఎంపీపీఎస్ ఎస్జీటీ కాశెట్టి రమేశ్‌పై ఒక్కసారిగా దాడిచేశారు. ఎంఈవో సీతాలక్ష్మి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా మహేశ్ ఆమెను దుర్భాషలాడుతూ నెట్టివేశాడు. దీంతో ఆమె ఎడమచేతి మణికట్టు విరిగింది. మహేశ్ ప్రవర్తన బాగోలేదని గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం వల్లనే కక్ష పెంచుకొని దాడికి దిగాడని ఎంఈవో ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.