హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : బీసీ నేతలను ముఖ్యమంత్రి రేవంత్ టార్గెట్ చేశారా? తిరుగుబాటు చేస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలను ఏమీచేయలేక, తన కుర్చీని కాపాడుకొనేందుకు బీసీలను బలిపీఠం ఎక్కిస్తున్నారా? పరకాల వివాదం ఆ ప్లాన్‌లో భాగమేనా? కాంగ్రెస్‌లో తాజా పరిణామాలను చూస్తే అలాంటి సంకేతాలే వెలువడుతున్నాయి. ఇటీవల సంగారెడ్డి బహిరంగసభలో సీనియర్ నేత జగ్గారెడ్డికి అసెంబ్లీ టికెట్ వ్యవహారాన్ని అధిష్ఠానమే చూసుకుంటుందని హైకమాండ్ కోర్టులోకి బంతిని నెట్టేసిన ముఖ్యమంత్రి రేవంత్.. పరకాలలో మాత్రం టీడీపీ వలస నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డికి వేదికపైనే టికెట్ ఖాయం చేసేశారు. వాస్తవానికి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే అభ్యర్థులను ముఖ్యమంత్రి ప్రకటించే సంప్రదాయంగానీ, అధికారంగానీ లేదు. అయినప్పటికీ మొదటినుంచీ పార్టీని నమ్ముకొని ఉన్నవారిని కాకుండా తనకు అనుకూలంగా ఉండే వర్గానికే అవకాశాలిచ్చే ఎత్తుగడ వేసినట్టు తెలుస్తున్నది. ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్ల ముందే హడావుడిగా అభ్యర్థులను ప్రకటించడం వెనుక పక్కా వ్యూహమే ఉన్న ట్టు స్పష్టమవుతున్నది. పరకాల టికెట్ వివాదం రాజేసి.. బీసీ మంత్రి కొండా సురేఖ మెడకు ఉచ్చు బిగించే ఎత్తుగడను వేసినట్టు తెలుస్తున్నది. పరకాల సభ సందర్భంగా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని.. పక్కావ్యూహం ప్రకారం ‘ముఖ్య పీఠం’ కాపాడుకొనేందుకు బీసీ నేతలపై కావాలనే కుట్రలు చేస్తున్నట్టు ఆ పార్టీలోనే చర్చ జరుగుతున్నది. ఈ కుట్రల నుంచి పొన్నం ప్రభాకర్ తృటిలో తప్పించుకోగా, సురేఖ కూతురి రూపంలో ఈ ఉచ్చులో పడ్డారని అంచనా వేస్తున్నారు.
ఇటీవల సంగారెడ్డి వేదికగా నిర్వహించిన సభలో సీనియర్ నేత జగ్గారెడ్డి అసెంబ్లీ టికెట్ వ్యవహారాన్ని సీఎం రేవంత్ ప్రస్తావిస్తూ.. దాన్ని కాంగ్రెస్ అధిష్ఠానమే చూసుకుంటుందని స్పష్టంగా తేల్చిచెప్పారు. వాస్తవానికి జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో సీనియర్ నేత. మొదటినుంచీ గాంధీ కుటుంబానికే అంకితమైన విధేయుడు. సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి అనే చెరగని రాజకీయ ముద్ర ఉన్నచోట.. మరొకరు టికెట్ ఆశించే ఆసారమే లేదు. అయినప్పటికీ సీఎం రేవంత్ అకడి టికెట్ కేటాయింపును కావాలనే హైకమాండ్ కోర్టులోకి నెట్టేశారని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. అదే రేవంత్‌రెడ్డి పరకాల సభకు వచ్చేసరికి మాత్రం మాటతీరు మార్చేశారు. పూర్తి భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు. అకడ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి వచ్చే ఎన్నికల టికెట్‌ను తానే స్వయంగా ఖరారు చేస్తూ బహిరంగంగా ప్రకటన చేశారు. నిజానికి పరకాల టికెట్‌ను బీసీ మహిళా నేతగా, జెన్‌జీ ప్రతినిధిగా మంత్రి సురేఖ కుమార్తె కొండా సుస్మిత మొదటినుంచీ బలంగా ఆశిస్తున్నారు. ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రే ‘జెన్-జీలు చట్టసభల్లోకి రావాలి. అందుకోసం చట్ట సవరణలు అవసరం’ అని పిలుపునివ్వడం సుస్మిత రాజకీయ ఆకాంక్షలకు మరింత ఊతమిచ్చింది. సరిగ్గా ఇకడే రేవంత్ తన రాజకీయ వ్యూహానికి పదును పెట్టారని, కొండా కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేందుకే, వలస మిత్రుడు రేవూరికి రెడ్డికి తానే ఏకపక్షంగా టికెట్ ప్రకటించుకున్నారనే చర్చ జోరుగా సాగుతున్నది.
కాంగ్రెస్ సంప్రదాయాల్లో ముఖ్యమంత్రికి స్వతహాగా టికెట్లు ప్రకటించే విచక్షణాధికారాలు కానీ, సంప్రదాయం కానీ ఎకడా లేదని సీనియర్ మంత్రి ఒకరు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో చెప్పారు. పార్టీ పదవులు, టికెట్ల కేటాయింపులన్నీ హైకమాండ్ కనుసన్నల్లోనే జరుగుతాయని, వైఎస్ లాంటి నేత సైతం సొంతంగా టికెట్లు ప్రకటించే సాహసం చేయలేదనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. తాను అనుకున్న వారికి అధిష్ఠానాన్ని ఒప్పించి ఇప్పించుకున్నారే తప్ప, రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఎన్నడూ బహిరంగ ప్రకటనలు చేయలేదని చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్ల సుదీర్ఘ సమయం ఉండగా ఇప్పుడే టికెట్ల రగడను తెరపైకి ఎందుకు తెచ్చారు? ఒకవేళ టికెట్లు ప్రకటించాలనుకుంటే సంగారెడ్డిలో జగ్గారెడ్డికైనా, పరకాలలో రేవూరి ప్రకాశ్రెడ్డికైనా ఒకే నిబంధన వర్తించాలి కదా? ఒకచోట ఒకలా, మరోచోట ఇంకోలా ప్రదర్శిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాల అంతరార్థమేమిటి? తన పీఠం కాపాడుకునేందుకే బీసీ నేతలను బలిపీఠం ఎక్కిస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతున్నది. బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలపై గురిపెట్టారని.. పొన్నం తృటిలో తప్పించుకోగా, కొండా ఆ ఉచ్చులో పడ్డారని పార్టీలో అంతర్గతంగ సాగుతున్న చర్చల సారాంశం. పొన్నం కు శాఖల మీద అజమాయిషీ లేదని, ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించి అదే సామాజిక వర్గం నేతకు పదవి ఇవ్వాలని ఓ వర్గం నుంచి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయని, అందుకు ఢిల్లీ నాయకత్వం అంగీకరించకపోవటంతో ప్లాన్-బీ అమలు చేసినట్టు చెప్తున్నారు.
ప్రభుత్వ విధానాలపై బాహాటంగానే అసమ్మతి గళం వినిపిస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా, కనీసం వివరణ అడిగే ధైర్యం కూడా చేయని కాంగ్రెస్ నాయకత్వం.. ఆధిపత్యవర్గాల ముందు ఎంతగా మోకరిల్లిందో అర్థమవుతున్నదని టీపీసీసీ నేత ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు. మేజర్ అయ్యుండి, సొంతంగా కుటుంబం ఉన్న కుమార్తె చేసిన రాజకీయ ప్రకటనలకు తల్లిని బాధ్యురాలిని చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ద్వారా షోకాజ్ నోటీసులు ఇప్పించారు. ఆ వ్యాఖ్యలు కుమార్తె వ్యక్తిగతమని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి సురేఖ ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చినప్పటికీ.. ఆమెను పదవి నుంచి తొలగించాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఇదే సరైనదని భావిస్తే.. కొండా సురేఖకు వర్తించిన సూత్రం కోమటిరెడ్డికి ఎందుకు వర్తించని పార్టీలోని ఓ వర్గం ప్రశ్నిస్తున్నది. నల్లగొండ జిల్లాలో సొంతపార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వంపైన, సీఎంపైనా నేరుగా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారని.. ఈ వ్యాఖ్యలకు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? అన్న ది మరికొందరి వాదన. ‘కూతురు సుస్మిత మాట్లాడిన మాటలకే తల్లి మంత్రి పదవిని ఊడగొట్టాలని డిమాండ్ చేస్తున్న నాయకు లు.. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు వ్యాఖ్యలకు అన్న వెంకట్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయగలరా? ఆ ధైర్యం వారికి ఉన్న దా?’ అని వారు నిలదీస్తున్నారు. ఒక బీసీ మంత్రి కుమార్తె రాజకీయ స్వేచ్ఛతో, స్వీయపరిణతితో మాట్లాడితే తల్లిని పదవినుంచి బర్తరఫ్ చేయాలని తోటి బీసీనేతలతోనే ప్రెస్మీట్లు పెట్టిస్తుండటం పార్టీలోని పెత్తందారీ పోకడలేనని బీసీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆధిపత్య వర్గాలు నేరుగా ముందుకొస్తే ‘బీసీ వ్యతిరేక ముద్ర’ పడుతుందనే భయంతో, బలమైన బీసీ మహిళా గళాన్ని అణచివేసేందుకు ‘డివైడ్ అండ్ రూల్’ కుతంత్రాలు అమలు చేస్తున్నారని వారంటున్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనపై కొంతకాలంగా సొంతపార్టీ ఎమ్మెల్యేలే తీవ్రస్థాయిలో తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. ప్రధానంగా పార్టీకి అత్యధిక ఎమ్మెల్యేల బలం ఉన్న నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలు బహిరంగంగానే అసమ్మతి గళం వినిపిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గాల్లో పనుల కేటాయింపులు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై బాహాటంగా అసంతృప్తి వెళ్లగకగా.. ఎమ్మె ల్యే అనిరుధ్‌రెడ్డి సొంతపార్టీ మంత్రులు, అధికార యంత్రాంగం వ్యవహారశైలిపై నిప్పులు చెరుగుతున్నారు. చిన్నారెడ్డి, మేఘారెడ్డి వంటి సీనియర్లు సైతం అభివృద్ధి పనుల కేటాయింపులు, నిధుల విడుదల, పదవుల పంపకాలపై బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. ఈ బలమైన నేతలను ఏమీ చేయలేక చేతులెత్తేసిన ప్రభుత్వ పెద్దలు.. బీసీ నేతలపై మాత్రం సందు దొరికిప్పుడల్లా అవకాశం చూపుతున్నారని చర్చ మొదలైంది. వాస్తవానికి మంత్రి కొండా సురేఖ పార్టీపట్ల గానీ, ప్రభుత్వంపట్ల గానీ ఎలాంటి బహిరంగ విమర్శలు చేయలేదు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆమెకు కనీస సమాచారం ఇవ్వకుండానే యాదగిరిగుట్ట బోర్డు కమిటీని వేసినా ఆమె మౌనంగానే ఉన్నారు. తన బద్ధ వ్యతిరేకి అయిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ పరిధిలోకి చొరబడి సమీక్షాసమావేశాలు నిర్వహించినప్పుడూ పార్టీ అంతర్గత వేదికలపైనే ఫిర్యాదు చేశారు తప్ప, రచ్చకెకలేదు. తన శాఖకు సంబంధించిన ఫైళ్లను అడ్డుకున్నా ఓర్చుకున్నారు. ఆఖరికి ముఖ్యనేత క్యాంప్ సోషల్‌మీడియా, ఆయన అనుకూల మెయిన్ స్ట్రీమ్మీడియా ఆమెను మంత్రివర్గం నుంచి తొలగిస్తారంటూ ఏడాదిగా చేస్తున్న విష ప్రచారాన్ని సైతం మౌనంగా భరించారు.
మంత్రి కొండా సురేఖను పలురకాలుగా వేధించినా.. అనుకున్న ఫలితం కానరాకపోవడంతో రాజకీయ దూకుడుతనం వారసత్వంగా అబ్బిన ఆమె కుమార్తె సుస్మితను టార్గెట్ చేసినట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. అందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ముఖ్యనేత సన్నిహితుడు ఆ మేరకు పకా వ్యూహరచన చేసినట్టు సమాచారం. అందులో భాగంగానే పరకాల పర్యటన ప్రణాళికను పకాగా రూపొందించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సభ వేదికగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి టికెట్ ఖరారు చేసి కొండా కుటుంబాన్ని రెచ్చగొట్టి, ఉచ్చులోకి లాగారని ఆరోపిస్తున్నాయి. నియోజకవర్గంపై గంపెడాశలు పెట్టుకున్న సుస్మిత సహజంగానే దూకుడుగా స్పందించారని, సీఎం, ఆయన సోదరుల వ్యవహారశైలిపై ఆమె నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారని అంటున్నారు. సరిగ్గా ఈ అవకాశం కోసమే కాచుకూర్చున్న వర్గం.. క్షణాల్లో పావులు కదిపి, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి సీఎల్పీ వేదికగా ప్రెస్మీట్లు పెట్టించినట్టు చెప్తున్నారు.