హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెను విరమించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇస్తున్నామని తెలిపారు. వారి సేవలను సీఎం కేసీఆర్ గుర్తించి అడగకుముందే వేతనాలు పెంచారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆయన దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయని, సమయానుకూలంగా తగిన నిర్ణయాలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని పేర్కొన్నారు. క్షుద్ర రాజకీయాల వలలో చికుకోవద్దదని, వేరొకరి మాటలు విని ఆగం కావద్దని హితవు పలికారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.500, వెయ్యి కూడా లేని వేతనాలను తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ 8,500కు పెంచారని, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరో రూ.1000 పెంచారని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో రూ.5,200, ఏపీలో 6 వేలు ఉండగా, ఛత్తీస్గఢ్లో అసలు వేతనాలే ఇవ్వడం లేదని పేర్కొన్నారు.