మహ్మదాబాద్, జూలై 31: మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రూ.9 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో భాగంగా మాజీ ఎంపీటీసీ సువర్ణ రూ.4,41,321తో రెండు సీసీ రోడ్డు పనులు చేపట్టారు. ఈ పనులను గతేడాది మార్చిలో పూర్తి చేయగా.. బిల్లులకు సంబంధించిన చెక్కును పంచాయతీ కార్యదర్శి పాండురంగం సువర్ణకు అందజేశారు. కాగా.. ఆ బిల్లులో తనకు రూ.20 వేలు ఇవ్వాలని పాండురంగం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో సువర్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పాండురంగంకు సువర్ణ రూ.9 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. పాండురంగంను మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ బీ శ్రీకృష్ణాగౌడ్ తెలిపారు. ఇందులో ఇన్స్పెక్టర్లు లింగస్వామి, ఏఎస్కే జిలానీ, అధికారులు ఉన్నారు.