హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో చిరుద్యోగుల వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చేసిన పనికి ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడటం ఉద్యోగుల్లో గుబులు కలిగిస్తున్నది. ఈ ఘటనలు ప్రభుత్వ విధానాల్లో తప్పిదాలను, సిబ్బంది మానసిక స్థితిని ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల మల్టీపర్పస్ ఉద్యోగి, మొన్న కంప్యూటర్ ఆపరేటర్ ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పటికే ఐదు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దసరా నాటికైనా వేతనాలు అందుతాయా? అంటూ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిషారం చూపకపోతే, మరిన్ని దారుణ ఘటనలు జరిగే అవకాశముందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గ్రీన్‌చానల్ విధానం ఏమైనట్టు?
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని 16 విభాగాల్లో 92,175 మంది చిరుద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో అత్యధిక సంఖ్యలో మల్టీపర్సస్ ఉద్యోగులు 52,473 మంది, సెర్ప్‌లో 22,011 వేల మంది, సొసైటీ ఫర్ రూరల్ డెలవప్మెంట్ సర్వీసెస్ (ఎస్ఆర్డీఎస్)లో 12,586 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి జీతాలకు నెలకు రూ.115 కోట్ల పైచిలుకు అవుతుందని, వీరికి గ్రీన్‌చానెల్ ద్వారా వేతనాలు ఇస్తామని ఆ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. కానీ ఆ విధానం అమలు కావడంలేదు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్సస్ ఉద్యోగులకు, కంప్యూటర్ ఆపరేటర్లకు కూడా జూలై నుంచి వేతనాలు అందలేదు. కొన్ని జిల్లాల్లో మూడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. మిషన్ భగీరథలో పనిచేస్తున్న సుమారు 18 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు కూడా వర్ణనాతీతంగా మారాయి. కొందరికి 12 నెలలు, మరికొందరికి ఆరు నెలలు, ఇంకొందరికి నాలుగు నెలలుగా జీతాలు రావడంలేదు. ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఇచ్చినా చెత్తబుట్టపాలు అవుతున్నాయని, శాశ్వత పరిషారం లభించడంలేదని ఉద్యోగులు చెప్తున్నారు.
వరుసగా ఇద్దరు మృత్యువాత
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో సోమిరెడ్డి కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. రెండు నెలలుగా జీతాలు లేక కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల శుక్రవారం నల్లగొండలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక పక కాంట్రాక్టు ఏజెన్సీల దోపిడీ, మరోవైపు సరైన సమయానికి జీతాలు రాక ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రతి నెలా జీతాలు రాకపోవడం, ఆర్థిక సమస్యలు వెంటాడటం.. గత్యంతరం లేని పరిస్థితుల్లో సోమిరెడ్డి ప్రాణాలు తీసుకున్నట్టు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలే సీతక ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడు మైదం మహేశ్ వేతనం అందక ప్రాణాలు తీసుకున్నాడు. ఆ ఘటన మర్చిపోకముందే.. అదే శాఖలో మరో ఉద్యోగి చనిపోవడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబాలతో ఆందోళనకు దిగుతాం
‘పిల్లలకు సూల్ ఫీజు, ఇంటి కిరాయి కూడా కట్టలేకపోతున్నాం. పూట గడవడం కోసం అప్పులు చేయాల్సి వస్తున్నది. ఇలాంటి దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. జీతాల సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే మా పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారుతుంది.కుటుంబాలతో కలిసి ఆందోళన బాట పడుతాం. సర్కారు తీవ్రమైన నిరసన ఎదురోవాల్సి వస్తుంది’ అని మల్టీపర్సస్ ఉద్యోగుల సంఘం నేత తెలిపారు.