హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42శాతమా? 25శాతమా? అన్నది త్వరలో తేలనున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలవుతుందా? లేక ఇతర హామీల్లాగే బుట్టదాఖలవుతుందా? అన్నది క్యాబినెట్ నిర్ణయంపై ఆధారపడి ఉన్నది. గత కొన్నాళ్లుగా 42% బీసీ రిజర్వేషన్ అంశంపై చిక్కుముడి వీడకపోవడంతో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24లోగా స్పష్టంగా చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆలోగా తప్పనిసరిగా నిర్ణయం ప్రకటించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అంశాలపై నోట్‌ఫైల్ తయారు చేయాలని పంచాయతీరాజ్‌శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ సృజనకు బుధవారం సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీచేశారు. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సిద్ధంచేసిన నోట్‌ఫైల్‌ను ప్రభుత్వానికి పంచాయతీరాజ్‌శాఖ అధికారులు పంపినట్టు తెలిసింది.
ఎన్నికల నిర్వహణలో ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని, గ్రామాలకు ఆర్థికంగా తీవ్రనష్టం వాటిల్లిందని, ఎందుకు నిర్వహించాలో, దాని వల్ల కలిగే ప్రయోజనాలను ఉటంకిస్తూ ఆ నోట్‌ఫైల్‌ను సమర్పించినట్టు సమాచారం. ఈ నెల 17న జరిగే క్యాబినెట్ సమావేశంలో నోట్‌ఫైల్‌పై చర్చించి స్థానిక ఎన్నికలపై ముందుకా? వెనుకకా? అన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని దాటకుండా నిర్వహించుకోచ్చని చెప్తూ హైకోర్టు ఇచ్చిన నాలుగు వారాల గడువు డిసెంబర్ 3వ తేదీతో ముగియనున్నది.
ఈ నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాల్సి ఉన్నది. బీసీ సమాజానికి ఇచ్చిన మాటకు కట్టుబడి 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందా? లేక ధోకా చేసి పాత రిజర్వేషన్ల ప్రకారం కేవలం 25% రిజర్వేషన్లతోనే ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకుంటుందా? అన్న విషయం 17 తర్వాత తేలనున్నది.