హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో తెగేలా లేదు. పంచాయితీ రోజు రోజుకు రాజుకుంటున్నది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(శాట్స్), పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒకరిపై మరొకరు నెపం నెడుతున్నారు. తప్పు మీ దగ్గర జరిగిందంటే.. మీ దగ్గర జరిగిందని ఆరోపించుకుంటున్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ ఉద్యోగాల భర్తీలో భారీ స్కాం జరిగిందన్నది అభ్యర్థుల ఆరోపణ. ఒక్కో పోస్టును రూ.15లక్షలకు అమ్ముకున్నారని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయకుండానే ఈ కోటా టీచర్ ఉద్యోగాలను భర్తీచేశారు. ఆన్లైన్లో అభ్యర్థి నమోదు చేసిన వివరాల ఆధారంగా అర్హులను తేల్చారు. అభ్యర్థి ఆన్లైన్లో ఏది నమోదుచేస్తే దాన్నే ప్రమాణికంగా తీసుకున్నారు. దీని వెనుక భారీ స్కాం ఉన్నదని ఆరోపిస్తున్నారు.
ఈ పోస్టుల భర్తీలో అనేక నిబంధనలు ఉల్లంఘించారు. అంతర్జాతీయస్థాయి క్రీడాకారులను పక్కనపెట్టి అంతర్ జిల్లా, ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలిచ్చారు. వివాదం హైకోర్టుకు, లోకాయుక్తకు చేరింది. ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై ఇటీవల శాట్స్, విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. శాట్స్ అధికారులు ఒక రకంగా వాదిస్తే, విద్యాశాఖ అధికారులు మరోరకంగా వాదించారు. తప్పు మీదంటే మీదని ఒకరిని మీద ఒకరు నెపం వేసుకున్నారు.
విద్యాశాఖ ఆదేశాల ప్రకారమే తాము ఎంపిక చేశామని శాట్స్ అధికారులు చెప్పగా, విద్యాశాఖ అధికారులు పలు జీవోలను చూపించి తప్పు మీదేనని వాదించినట్టు తెలిసింది. మొత్తంగా ఏదీ తేల్చకుండానే ముగించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని విద్యాశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. దీనిపై ఏసీబీ లేదా సీబీ సీఐడీ విచారణ జరపాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.