Panchayat Elections | రాష్ట్రంలో తొలి విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూన్లలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్నది. ఆ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించి.. ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఉప సర్పంచ్ ఎన్నికలను సైతం చేపడుతారు. తొలి విడుతలో 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇందులో 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ఇక మిగతా 3,834 సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తుండగా.. 12, 960 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే, ఒక గ్రామ పంచాయతీ, పది వార్డుల్లో ఎన్నికలను నిలిపివేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 56,19,430 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 27,41,070, మహిళలు 28,78,159, ఇతరులు 201 మంది ఉన్నారు. మూడు విడుతల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల కోసం 93,905 మంది సిబ్బందిని నియమించినట్టు ఎస్ఈసీ కమిషనర్ పేర్కొన్నారు. 3,591 మంది రిటర్నింగ్ అధికారుల (RO)ను, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్టు చెప్పారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా 3,461 పోలింగ్ కేంద్రాలను పరిశీలించనున్నట్లు చెప్పారు. 45,086 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నట్టు చెప్పారు.