హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా నల్లగొండ జిల్లాకు చెందిన పల్లె రవికుమార్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్లె రవికుమార్‌గౌడ్ ఈ పదవిలో రెండేండ్లపాటు కొనసాగనున్నారు. గీత కార్మికుల కార్పొరేషన్ ఏర్పాటైన నాటినుంచి బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మొదటిసారిగా కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించింది. నల్లగొండ జిల్లాకు చెందిన పల్లె రవికుమార్‌గౌడ్ జర్నలిస్టుగా వివిధ దినపత్రికల్లో సుదీర్ఘకాలం పనిచేశారు.ఎన్నో అద్భుతమైన కథనాలు రాశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టులందరినీ ఏకంచేసి పోరుబాట పట్టించారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటులో కీలకంగా ఉన్న రవికుమార్.. అన్ని పార్టీల నేతలు ఉద్యమంలోకి వచ్చేలా కష్టపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో మైలురాయిగా నిలిచిపోయిన మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మెలో జర్నలిస్టు నేతగా ముందు నిలిచారు. స్వరాష్ట్రంలోనూ బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను గుర్తించి కార్పొరేషన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పల్లె రవికుమార్‌గౌడ్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గీతకార్మిక కార్పొరేషన్ చైర్మన్‌గా పల్లె రవికుమార్‌గౌడ్ నియామకంపై సర్వాయి పాపన్న మోకుదెబ్బ సంఘం (గౌడసంఘం) నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించడం ద్వారా గౌడకులస్థులకు ఎంతో లబ్ధి చేకూరనున్నదని, సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. చైర్మన్‌గా నియమితులైన పల్లె రవికుమార్‌గౌడ్‌కు మోకుదెబ్బ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కే వీరస్వామిగౌడ్, పల్సం సోమన్నతోపాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.