సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 18: నల్లగొండ జిల్లా గట్టుప్పల్ గ్రామానికి చెందిన శివరాత్రి సామెల్ సర్వేల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సామెల్ బుధవారం ఉదయం తోటి విద్యార్థులకు రాగి జావ సర్వ్ చేస్తుండగా గిన్నె జారి కాళ్ల మీద పడటంతో సామెల్తోపాటు మరో విద్యార్థి మదన్, వంట మనిషి బోయ ఇందిరకు గాయాలయ్యాయి. సామెల్‌కు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో, వంట మనిషి ఇందిరను నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు.
సర్వేల్ గురుకులంలో 650 మంది చదువుతుండగా కేవలం ఆరుగురు వంట మనుషులు మాత్రమే ఉన్నారు. ఇంతమందికి సర్వ్ చేయడం ఇబ్బందిగా మారడంతో ప్రిన్సిపాల్ ప్రతి రోజూ విద్యార్థులతోనే పనిచేయిస్తున్నారు. విద్యార్థికి గాయాలైన విషయం తెలియడం తో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో పాఠశాల కు చేరుకున్నారు.
అసలు బుధవారం మెనూలో లేని రాగి జావను వడ్డించడం చూస్తే గురుకుల పాఠశాలలో రోజూ మెనూ పాటించడం లేదని తెలుస్తున్నది. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని, చదువులు కూడా సరిగ్గా చెప్ప డం లేదని, రోజూ ఎనిమిదో తరగతి విద్యార్థులతో డైనింగ్ హాల్లో పనులు చేయిస్తున్నారని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ప్రిన్సిపాల్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
సర్వేల్ గురుకుల పాఠశాలలో వేడి జావ మీద పడటంతో గాయపడి హైదరాబాద్ ఎల్బీనగర్లోని చిన్మయి దవాఖానలో చికిత్స పొందుతున్న శివరాత్రి సామెల్‌ను కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్‌గౌడ్ పరామర్శించారు. విద్యార్థి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గురుకుల విద్యా సంస్థలను ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డా రు.బీఆర్ఎస్ నాయకులు, మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్, తమ్మడపల్లి మాజీ సర్పంచ్ అయిలి లక్ష్మీనర్సింహ గౌడ్, లంబాడా హక్కుల పోరాట సమితి అధ్య క్షుడు శేషు రాం నాయక్ తదితరులు ఉన్నారు.