హైదరాబాద్ : పల్లె ప్రగతి 5వ విడతను మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ఈ సారి బాధ్యత అంతా ప్రజా ప్రతినిధులదే. సమన్వయం చేసే బాధ్యతను జెడ్పీ చైర్మన్ లు, సీఈఓ లు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పల్లె ప్రగతి 5వ విడత కార్యక్రమ నిర్వహణపై రాజేంద్ర నగర్‌లోని TSIRD లో జెడ్పీ చైర్మన్లు, జెడ్పీ సీఈవోల సమీక్ష సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
దేశంలోనే మన మన గ్రామాలను నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పల్లె ప్రగతి వంటి అద్భుత కార్యక్రమాలతో సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. ఈ సారి పల్లె ప్రగతి కార్యక్రమం బాధ్యత పూర్తిగా జెడ్పీ చైర్మన్లు, సీఈఓలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు.
సన్నాహక సమావేశాలు పెట్టి మీ జిల్లా పరిధిలోని రాష్ట్ర మంత్రులను సంప్రదించిఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, సర్పంచులు, అధికారులు అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత అంతా మీరే తీసుకోవాలన్నారు.
జెడ్పీ చైర్మన్లు, జెడ్పీ సీఈవో లు గ్రామాల్లో పర్యటించాలని ఆయన సూచించారు. మీకు ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుంది. మనమంతా కలిసి కట్టుగా పల్లె ప్రగతిని విజయవంతం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు.