హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటైందని, ఈ ప్రాంత పసుపు రైతుల చిరకాల వాంఛ ఫలించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అనేకసార్లు ప్రధానికి, కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినట్టు తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం నాడు కవిత పార్లమెంట్లో గళమెత్తారని పేర్కొన్నారు. పసుపు పండించే రాష్ర్టాల సీఎంలతో కేంద్రానికి లేఖలు ఇప్పించడంలో కవిత కృషి చేశారని గుర్తు చేశారు. పసుపుబోర్డు ఎంపికైన చైర్మన్‌గా పల్లె గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
పసుపు మద్దతు ధర క్వింటాకు రూ.15,000 చొప్పున ఉండేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. నిజామాబాద్ సమీప ప్రాంతాల్లో పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుచేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. బాలొండ నియోజకవర్గంలోని వేల్పూరులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 42 ఎకరాల్లో టర్మరిక్ స్పైస్ పార్ ఏర్పాటు చేసి రోడ్లు, ప్రహరీ పనులను పూర్తిచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.