చేర్యాల, ఫిబ్రవరి 24 : సాగునీటి కోసం రైతుల కలిసి ఉద్యమిస్తామని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం చేర్యాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీటి విడుదలపై కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ధర్మసాగర్ నుంచి గండిరామరం వరకు ఫేజ్-2లోని రెండు మోటర్లు ఆన్‌చేసి బొమ్మకూరు, వెల్దండ, కన్నెబోయినగూడెం, లద్నూర్ రిజర్వాయర్లను నింపి, తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేర్యాల డివిజన్లో తపాస్‌పల్లి రిజర్వాయర్ కింద ఉన్న చెరువులు, కుంటలు, ఆయకట్టు తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. ఫిబ్రవరిలోనే భూగర్భ జలాలు అడుగంటిపోయి ప్రస్తుతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
గతంలో 200 నుంచి 300 ఫీట్ల లోతు బోర్లు వేస్తే సమృద్ధిగా నీళ్లు వచ్చేవని, ప్రస్తుతం 800 ఫీట్ల లోతులో బోరు వేసినా నీరు రావడం లేదన్నారు. దేవాదుల ప్రాజెక్టులోని ఆపరేషన్, మెయింటెనెన్స్ సిబ్బంది వేతనాల కోసం సమ్మెకు దిగడంతో పదిహేను రోజులు మోటర్లను నిలిపివేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనిపై తాను మాట్లాడితే చివరికి ప్రభుత్వం వారికి వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. కొంతమంది ఎమ్మెల్యే నీళ్లు తేవడం లేదని అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, తానే స్వయంగా అధికారులు, మంత్రులతో మాట్లాడి మోటర్లు ఆన్ చేయించిచడంతో ప్రస్తుతం గండిరామారం నుంచి 10 క్యూబిక్ నీళ్లు వస్తున్నట్టు తెలిపారు. మూడు రోజుల్లో తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీళ్లు విడుదల చేయనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి మాత్రమే ఆలేరుకు నీళ్లు వెళ్తున్నాయని తెలిపారు.