హైదరాబాద్ : గురువు చంద్రబాబు( Chandra babu )కు మేలు చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పాలమూరు ( Palamuru ) ప్రాజెక్టును పడావుపెట్టి, తెలంగాణ నీళ్లను దోచుకుపోవడానికి సహాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మెతుకు (Anand Methuku ) విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 90శాతం పూర్తయితే 10 శాతం పనులు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు.
శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేసి వికారబాద్‌కు సాగు, తాగు నీరు అందిస్తారని భావించిన ప్రజలకు నిరాశే ఎదురవుతుందని ఆరోపించారు. 2027 వరకు కొడంగల్‌కు నారాయణ లిప్ట్ ద్వారా నీరు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలు ఎండపెడుతరా అంటూ ప్రశ్నించారు.
వికారాబాద్ జిల్లాకు సాగు, తాగు నీటి ఇచ్చే ఆలోచన సీఎంకు లేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తామంటేనే రేవంత్ దిగి వచ్చిండని అన్నారు. వికారబాద్ జిల్లా ప్రజలు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు ఏకమై పోరాటాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు.