హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): శుత్రువుకు ఎలా జవాబు చెప్పాలో తమ సైన్యానికి తెలుసు అని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. భారత్ చేపట్టిన యుద్ధ చర్యకు దీటుగా జవాబు చెప్పే హక్కు పాకిస్థాన్‌కు ఉన్నదని చెప్పుకున్నారు. ప్రధాని షెహబాజ్ నేతృత్వంలోని నేషనల్ సెక్యూరిటీ కమిటీ (ఎన్ఎస్సీ) బుధవారం అత్యవసరంగా సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా భారత్‌పై ప్రతీకార దాడికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుత పరిస్థితి నుంచి భారత్ వెనక్కు తగ్గితే.. ఉభయ దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతను తగ్గించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నదని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. భారత్ పట్ల తాము శత్రు భావంతో వ్యవహరించబోమని తాము గత పక్షం రోజులుగా చెప్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు భారత్ దాడుల్లో మరణించిన లష్కరే తాయిబా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్ర ఐజీపీ, ఇతర పోలీసులు, సైనికాధికారులు పాల్గొన్నారు.