ఫేస్బుక్లో పాకిస్తాన్ ఐఎస్ఐకి రహస్యాలు చేరవేస్తూ అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): హానీ ట్రాప్‌లో పడి డీఆర్డీఎల్ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు అందిస్తున్న విశాఖపట్టణానికి చెందిన ఓ వ్యక్తిని రాచకొండ ఎస్వోటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సీపీ మహేశ్‌భగవత్ తెలిపిన వివరాల ప్రకారం… విశాఖపట్టణానికి చెందిన మల్లికార్జునరెడ్డి తండ్రి నేవీ విభాగంలో చార్జ్‌మన్‌గా పనిచేసి 2014లో రిటైరయ్యారు. మల్లికార్జునరెడ్డి బీటెక్ పూర్తి చేశాడు. ఇతను నగరంలోని ఆర్సీఐ బాలాపూర్‌లో నివాసముంటున్నాడు. కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఎల్ సంస్థకు చెందిన ప్రాజెక్టు వర్క్స్‌ను పటాన్చెరులో ఉండే క్వెస్ట్ కంపెనీ 2020 జనవరి వరకు చేపట్టింది. 2018లో మల్లికార్జునరెడ్డి ఈ క్వెస్ట్కంపెనీలో పనిచేసేవాడు. తర్వాత తానే సొంతగా ఏఎన్ఎస్పీ పేరుతో డీఆర్డీఎల్ నుంచి ప్రాజెక్ట్‌లు తెచ్చుకొనేవాడు. ఈ నేపథ్యంలో తన ఫేస్బుక్ ప్రొఫైల్‌లో వర్కింగ్ ఫర్ డీఆర్డీఎల్ అని పెట్టుకొన్నాడు. నటాశరావు అనే మహిళ ఇతని ఫేస్బుక్ ఖాతాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగా యాక్సెప్ట్ చేశాడు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో మల్లికార్జునరెడ్డి డీఆర్డీఎల్కు చెందిన రహస్య సమాచారం కూడా ఇచ్చాడు. ఇతనికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా కూడా తెరిచి ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐకి చేరవేస్తున్నాడని గుర్తించిన పోలీసులు మల్లికార్జునరెడ్డిని అరెస్ట్ చేశారు.