ఖైరతాబాద్, ఫిబ్రవరి 8: రాష్ట్రంలో 18 లక్షల మంది పద్మశాలీలు ఏమైయ్యారని పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. 2011లో నిర్వహించిన సర్వేలో 12 లక్షల మంది పద్మశాలీలు ఉన్నారని, ఇప్పడు తాజాగా కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన సర్వేలోనూ అదే 12 లక్షల మంది ఉన్నట్టు లెక్కలు చూపారని తెలిపారు.
దశాబ్దకాలం దాటినా అదే సంఖ్య చూపడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వాస్తవంగా రాష్ట్రంలో 30 లక్షల మంది వరకు ఉన్నారని, మిగతావారంతా ఏమైనట్టు అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలీలను వంచించిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ లెక్కలు చూస్తే పద్మశాలీల ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉన్నదని మండిపడ్డారు.
ప్రభుత్వం నుంచి ఆదరణ లేక అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాస్, కోశాధికారి నవీన్, గౌరవ అధ్యక్షుడు వేముల బాలరాజు, మల్లేశ్, ఉపాధ్యక్షులు వనమాల శంకర్, సీహెచ్ చంద్రుడు, గుండి నగేశ్, సూర్యప్రకాశ్, శ్రీనివాస్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.