Padi Kaushik Reddy | రాష్ట్రంలో జరిగే మైనింగ్ స్కామ్‌ను హరీశ్‌రావు అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెట్టారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. మైనింగ్ స్కామ్ మీద హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశామని పేర్కొన్నారు. హౌస్ కమిటీ వేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఏం సమస్య అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై సీఐడీ ఎంక్వైరీ వేస్తామని ప్రభుత్వం చెబుతోందని.. మంత్రి మీద సీఐడీ ఎంక్వైరీ వేస్తే న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.
మంత్రిని సీఐడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంటుందా అని పాడి కౌశిక్ రెడ్డి అడిగారు. అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశామని తెలిపారు. అయితే దానం నాగేందర్; కడియం శ్రీహరితో ముఖ్యమంత్రి మాట్లాడించారని చెప్పారు. దానం నాగేందర్ నోటికొచ్చినట్లు మాట్లాడి బెదిరించారని తెలిపారు.
అన్నం పెట్టిన కేసీఆర్ గురించి కడియం శ్రీహరి తప్పుగా మాట్లాడారని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. కడియం శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు. సిట్టింగ్ఋను కాదని కడియం శ్రీహరికి కేసీఆర్ టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. అందుకే నువ్వు ఏ పార్టీలో ఉన్నావని కడియం శ్రీహరిని అడిగామని తెలిపారు. తనతో పాటు బీఆర్ఎస్ సభ్యులందరూ అడిగారని.. ఇది తప్పా అని నిలదీశారు. కాంగ్రెస్ వాళ్ల దగ్గర ఎందుకు కూర్చున్నావని ప్రశ్నించాం.. అది తప్పా అని ప్రశ్నించారు. నువ్వు ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నావని కడియం శ్రీహరిని అడిగామన్నారు.
కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరూ నన్ను టార్గెట్ చేశారని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడినందుకు తనను టార్గెట్ చేశారని అన్నారు. నిరుద్యోగుల పక్షాన ఉద్యోగాలు అడిగినందుకు టార్గెట్ చేస్తున్నావా అని ప్రశ్నించారు. పెన్షన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తున్నావా అని నిలదీశారు. ప్రజల కోసం పోరాడుతున్నందుకే తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎథిక్స్ కమిటీకి కాంగ్రెస్ నేతల తిట్లు కనిపించవా అని ప్రశ్నించారు. దానం తిట్లు ఎథిక్స్ కమిటీకి రావా అని అడిగారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు మాట్లాడిన బూతులు అందరూ చూశారని తెలిపారు.
కడియం శ్రీహరి బీఆర్ఎస్లో ఉంటే కేసీఆర్, హరీశ్‌రావును ఎందుకు విమర్శించారని ప్రశ్నించారు. హామీలపై మేం ప్రశ్నిస్తే మమ్మల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.