ర్యాక్ మూమెంట్‌ను ఎఫ్‌సీఐ పెంచాలి
ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి గంగుల
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం మిల్లింగ్ ప్రక్రియను వేగంగా పునరుద్ధరిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 45 రోజుల అనంతరం సీఎంఆర్‌కు ఎఫ్‌సీఐ అనుమతించిన నేపథ్యంలో మిల్లింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నదని తెలిపారు. బియ్యాన్ని గోదాములకు తరలించేందుకు ర్యాక్‌ల లభ్యతను పెంచాలని ఎఫ్‌సీఐని కోరినట్టు చెప్పారు. మిల్లింగ్ ప్రక్రియపై శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
సీఎంఆర్ గడువు పెంచాలని ఎఫ్‌సీఐకి లేఖ రాస్తామని తెలిపారు. మిల్లింగ్‌లో వేగం పెంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, సివిల్ సైప్లె అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మిల్లింగ్ ప్రక్రియ పునరుద్ధరించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేషన్ జీఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.