దుబ్బాక, మార్చి 1 : సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతంలో యాసంగిలో వేసిన వరిపంట ఎండిపోతున్నది. తలాపున మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ సాగునీటి సమస్యతో పొలాలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో వేసవికి ముందే మల్లన్నసాగర్ నుంచి నీటిని విడుదల చేసి ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నింపేవారు. దీంతో సాగునీటి ఇబ్బందులు ఎదురుకాలేదు. నీటి వసతి పెరగడంతో బీడు భూములు సైతం సాగులోకి వచ్చాయి. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు తలకిందులయ్యాయి. మల్లన్నసాగర్ నుంచి ప్రభుత్వం సకాలంలో నీటిని విడుదల చేయకపోవడంతో కూడవెల్లి వాగు ప్రవాహ సమీప గ్రామాల రైతులకు సమస్య తలెత్తింది. మరోవైపు మల్లన్నసాగర్-4ఎల్ డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం పూర్తికాకపోవడంతో 10 గ్రామాల రైతులు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. పొలాలు నెర్రెలు చాచి ఎండిపోతున్నాయి. రైతులు కన్నీరు పెడుతున్నారు.