బండ్లగూడ మండలం సలకం చెరువును ఆక్రమించి ఒవైసీ బ్రదర్స్ నిర్మించిన ఫాతిమా విద్యాసంస్థలే హైడ్రా తదుపరి లక్ష్యమని జోరుగా ప్రచారం జరుగుతున్నది. చెరువులో ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గూగుల్ మ్యాప్ చిత్రాలతో సోషల్‌మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్‌గా మారాయి.
HYDRA | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రా తరువాతి లక్ష్యం ఓవైసీ బ్రదర్స్ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఓవైసీ బద్రర్స్‌కు చెందిన అక్రమ కట్టడాలపై ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ జిల్లా పాతనగరంలోని బండ్లగూడ మండల పరిధిలోని సలకం చెరువులో ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా విద్యాసంస్థలు నిర్మించారని ఫిర్యాదు చేశారు. చెరువును సగం ఆక్రమించి ఫాతిమా విద్యాసంస్థలు నిర్మించారని అసద్‌పై ఆరోపణలు ఉన్నాయి. చెరువులోనే బిల్డింగులు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడంలేదని ఎక్స్‌లో సీఎం రేవంత్‌ను పాతబస్తీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ అసదుద్దీన్ కూడా హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. కొన్ని ప్రభుత్వ భవనాలు కూడా చెరువు ఎఫ్టీఎల్లో కట్టారని, వాటిని కూల్చుతారా అని ప్రశ్నించారు.
చెరువుగా గుర్తించిన హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్…
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తున్న లేక్ ప్రోటెక్షన్ వెబ్సైట్లో బండ్లగూడ మండల పరిధిలోని బండ్లగూడ కల్సా గ్రామ రెవెన్యూ పరిధిలోని సలకం చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ సరిహద్దులను గుర్తించి, కెడాస్ట్రల్ మ్యాప్‌లను రూపొందించి ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. లేక్ గుర్తింపు నంబరుగా 4001/1(13-12-2016) పేరుతో ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈ చెరువులోనే స్పష్టంగా ఓవైసీకి చెందిన విద్యాసంస్థ ఉన్నట్టు గూగుల్మ్యాప్లో కనిపిస్తోంది. ఇదే చిత్రాన్ని సోషల్ మీడియాలో పలువురు వైరల్ చేస్తున్నారు.