హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మొత్తం 378 ఈహెచ్టీ(ఎక్స్ట్రా హైటెన్షన్) సబ్స్టేషన్లు ఉండగా, ఇందులో 56 సబ్స్టేషన్లపై ఓవర్లోడ్ పడుతున్నది. ఇందుకు కారణం వీటి పరిధిలో అత్యధిక విద్యుత్తు వినియోగమేనని అధికారులు గుర్తించారు. ఇవి ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటం గమనార్హం. వేసవిలో విద్యుత్తు డిమాండ్ నేపథ్యంలో అధికారులు సర్వే నిర్వహించారు. ఓవర్లోడ్ సమస్య ఉన్న సబ్స్టేషన్లలో 53 సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 29 సబ్స్టేషన్ల సామర్థ్యం పెంపు పనులు పూర్తవగా, మరో 24 సబ్స్టేషన్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా మరో 6 హైటెన్షన్ లైన్లలో ఓవర్లోడ్ సమస్య తలెత్తింది. వీటిలో మూడు హైటెన్షన్ లైన్ల నిర్మాణం పూర్తవగా, మరో మూడింటి పనులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఓవర్లోడ్ సమస్య ఉంటే, ఇక ఏప్రిల్, మే నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.