నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ (Orange travels) బస్సు హనుమాన్‌పేట బైపాస్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి బాపట్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.