ఖైరతాబాద్, జూలై 30: రాష్ట్రంలో కీలకమైన నీటి పారుదలశాఖ (జలసౌధ)లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఔట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య తెలిపారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం ఎర్రమంజిల్లోని జలసౌధ ఎదుట ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిపారుదల శాఖలో అనేక ఏండ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు.
అసలే చాలిచాలనీ వేతనాలతో కుటుంబాలను పోషించుకోవడమే కష్టంగా ఉన్న తరుణంలో ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతోపాటు ఔట్సోర్సింగ్లో తొలగింపు లాంటి చర్యలు చేపడుతుందని మండిపడ్డారు. జొమాటో, స్విగ్గీలలో పనిచేసే వారిపై ఉన్న ప్రేమ, ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా పెండింగ్లోని వేతనాలు చెల్లించాలని, లేకపోతే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ మహ్మద్, బాలకృష్ణ, రాజశేఖర్, సురేంద్రకుమార్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.