ఖైరతాబాద్, సెప్టెంబర్ 2 : రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో వారంతా రోడ్డెక్కారు. తెలంగాణ మోడల్ స్కూల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ధర్నాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలలుగా ఆదర్శ పాఠశాలల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వేతనాలు ఇవ్వకుంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేజ్ ప్యాకేజీ ఇవ్వాలని, మూడేండ్లకు మించి పని చేసిన వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు అవినీతికి పాల్పడుతున్నాయని, తక్షణమే వాటిని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశం బృందం విద్యాశాఖ డైరెక్టర్‌తో మాట్లాడారు. మొదటి విడతలో మూడు, ,మరో విడతలో మిగతా మూడు నెలల వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో యాదగిరి, కొండయ్య, నందగోపాల్, రామకృష్ణ, రవి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.