నిర్మల్ అర్బన్, ఆగస్టు 24 : నిర్మల్ జిల్లాలోని సోన్ మండల కేంద్రంలో 90 శాతం మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. పేద రైతులు కావడంతో బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకుంటూ పంటలు పండిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. కొన్ని రోజుల క్రితం విడుతలవారీగా ప్రభుత్వం రుణాలను మాఫీ చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.2 లక్షల లోపు రుణాల మాఫీ ప్రకటించినా సోన్ మండలంలోని కొంత మంది రైతులకు రుణాలు మాఫీ కాకపోవడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. గ్రామంలో దాదాపు 784 మంది రైతులు రుణమాఫీకి అర్హులు కాగా.. ఇప్పటివరకు దాదాపు 248 మంది రైతులకు మాత్రమే రుణాలు మాఫీ కాగా 536 మందికి రుణాలు మాఫీ కావాల్సి ఉంది.
బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించడంతో ఎంతో సంబరంతో బ్యాంకుకు వెల్లిన రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. రుణాలు మాఫీ అవుతాయన్న ఆశతో బ్యాంకుకు వెల్లిన రైతులు రోజూ నిరాశకు గురవుతున్నారు. నాట్లు వేసే సమయంలో పొలాల్లో ఉండాల్సిన రైతులు పనులను వదిలి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
మాఫీ కోసం వస్తే స్టేట్మెంట్ ఇస్తున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణాలు మాఫీ అయ్యాయా అని బ్యాంకుకు వెళితే అధికారులు రుణాలు మాఫీ కాలేవని స్టేట్మెంట్లు చేతిలో పెడుతున్నారు. నాకు మూడున్నర ఎకరాల భూమి ఉంది. క్రాప్ లోన్ కింద రూ.1.48 లక్షలు బ్యాంకులో అప్పు తీసుకుని పంటలు పండిస్తున్నా. ఇప్పుటికే వ్యవసాయ సాగుకు బయట రూ.80 వేలు అప్పు తీసుకున్నా. రుణం మాఫీ కాకపోతే అప్పుల్లో కూరుకుపోతా. కాంగ్రెస్ సర్కారు వెంటనే రుణాలను మాఫీ చేసి ఆదుకోవాలి.
– గంధం వెంకట నారాయణ, సోన్.
కేసీఆర్ హయాంలోనే బాగుండే..
మాది సోన్ గ్రామం. నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. పంటలు పండించేందుకు లక్ష రూపాయల వరకు బయట అప్పులు ఉన్నాయి. బ్యాంకులో రూ.98 వేల రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తారనుకుని సంబర పడ్డా. తీరా బ్యాంకుకు వచ్చి చూసే సరికి రుణాలు మాఫీ కాలేవు అంటున్నారు. కేసీఆర్ హయాంలోనే బాగుండే అప్పుడే మాకు రుణమాఫీ వచ్చింది.
– గంగారపు అమృత్, రైతు, సోన్.
బ్యాంకుల సుట్టే తిరుగుతున్న..
సారూ. మాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. పంటలు పండించేందుకు రూ.1.58 లక్షలు బ్యాంకులో వ్యవసాయ రుణం తీసుకున్న. పేద రైతులను కావడంతో రూ.2లక్షల వరకు రుణం మాఫీ అవుతాయని అనికుని సంబురపడ్డా. తీరా బ్యాంకుకు వస్తే మీ రుణం మాఫీ కాలేదని బ్యాంకు అధికారులు అంటున్నరు. పొలం పనులు వదులుకుని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. అయినా మాఫీ కాలేదు.
– బి.తిరుపతి, సోన్.
దరఖాస్తులు స్వీకరిస్తున్నాం..
సోన్ మండలంలోని రైతులకు ఆధార్ కార్డు, పట్టాపాస్ బుక్‌లలో తేడాలు, డీబీటీ ఫెయిల్ కావడంతో ఇండియన్ బ్యాంకులో రైతుల వివరాలను పరిశీలించగా నో డాటా ఫౌండ్ అని వస్తుంది. ఈ విషయంపై కమిషనరేట్ అధికారులకు విన్నవించాం. మొదటి ఫేస్‌లో రైతులు ఎవ్వరికి రుణాలు మాఫీ కాకపోవడంతో ఖాతాల వివరాలను రెక్టిఫైడ్ చేయడంతో 200 మంది రైతులకు రూ.1.97 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. రుణాలు మాఫీ కాని రైతుల నుంచి రైతు వేదికల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. వివరాలు పరిశీలించి వీరందరికీ రుణాలు మాఫీ అయ్యేలా చూస్తాం.
– వినోద్, ఏవో, సోన్.