హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): కుటుంబం పొట్ట నింపడం కోసం గంటలతరబడి రోడ్లపై నిలిచి వ్యాపా రం చేస్తే వచ్చే ఆదాయంలో సగం గూండాల పాలవుతున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏదు న్నా, ఎమ్మెల్యే ఎవరైనా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లోకల్ గూండాల వేధింపులతో వీధి వ్యాపారుల కష్టం నిమిషాల్లో కరిగిపోతున్నది. గూండాయిజానికి ఈ ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలని స్ట్రీట్ వెండర్స్ నిర్ణయించుకున్నారు. నియోజకవర్గం పరిధిలో 15 వేల కుటుంబాలకు పైగా స్ట్రీట్ వెండర్స్ ఉన్నా రు. రోజంతా కష్టపడితే వారికి సగటున 300 వరకు ఆదాయం వస్తుంది. అందులోనుంచి గూండాలు రూ.100 గుంజుకుపోతున్నారు. ఈ గుండాగిరీకి వ్యతిరేకంగా ఇప్పుడు వీధి వ్యాపారులు గళమెత్తుతున్నారు. తమ పొట్ట కొట్టకుండా.. వెన్నంటి నిలిచే అభ్యర్థికి ఓటు తో సమాధానం చెప్తామని అంటున్నారు. రౌడీషీటర్ కుటుంబం నుంచి తమను రక్షించే పార్టీకి మద్దతు తెలుపుతామని అంటున్నారు.
అండగా ఉన్న అభ్యర్థికే ఓటు
వీధి వ్యాపారులను గుర్తించి, తాము సురక్షితంగా వ్యాపారం చేసుకొనేందుకు సహకరించి, గూండాల బారి నుంచి కాపాడే పార్టీకే ఓటు వేస్తామని స్ట్రీ వెండర్స్ అంటున్నారు. ఎవరు గెలిచినా.. దాదాల వేధింపులు తప్పలేదని, ఇప్పుడు ఏకంగా గూండాలే ఈ ఎన్నికల్లో గెలిస్తే తమ పరిస్థితి ఏమిటని ఎర్రగడ్డలో వ్యాపారం చేసుకొనే సలీం ఆందోళన వ్యక్తంచేశారు. స్థానిక ఎన్జీవో ప్రతినిధులు ఈసారి తమకు అండగా నిలుస్తారన్న నమ్మకం ఉన్న నేతనే గెలిపించుకుంటామని, గుండాలకు అవకాశమే ఇవ్వబోమని చెప్తున్నారు.