హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పెట్టుబడులను ప్రకటించి ప్రజలను వంచిస్తున్నదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో గోడాడి ఇండియా, స్వచ్ఛ్ బయో, వాల్ష్ కర్రా, ఉర్సాలాంటి సంస్థల పేరుతో అనుమానాస్పద పెట్టుబడులు ప్రకటిస్తున్నదని మండిపడ్డారు. మనకిన్ బయో సంస్థ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ)లో కూడా రిజిస్టర్ కాలేదని పేర్కొన్నారు. ఎలాంటి నిర్దిష్ట వివరాలు లేకుండా ఒక మోసపూరిత వెబ్సైట్ ఈ ఏడాది మార్చి 16న సృష్టించారని ఆరోపించారు. ఆర్థిక పారదర్శకతలేని ఈ కంపెనీ రూ.340 కోట్ల పెట్టుబడి చేస్తున్నామని ప్రకటించడం అనుమానస్పదంగా ఉందన్నారు. నష్టాలను నమోదు చేస్తున్న యెంత్రా టెక్ కంట్రోల్స్ కంపెనీ రూ.255 కోట్ల పెట్టుబడి ఎలా పెట్టగలదు..? అని క్రిశాంక్ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు.