ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 21: ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బంగారు పతకం ఇచ్చేందుకు వర్సిటీ పూర్వ విద్యార్థి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత పొన్నాల లక్ష్మయ్య ముందుకువచ్చారు. పొన్నాల ఫౌండేషన్ ద్వారా ఈ పతకాన్ని అందించనున్నారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్‌తో చర్చించిన పొన్నాల.. నిబంధనల మేరకు రూ.5,50,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్యకు ప్రొఫెసర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది జరిగే స్నాతకోత్సవం నుంచి పొన్నాల ఫౌండేషన్ తరఫున లైబ్రెరీ సైన్స్‌లో బంగారు పతకం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ లైబ్రరీ ఆధునికీకరణకు పొన్నాల ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. లైబ్రరీతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అంతకుముందు మెయిన్ లైబ్రరీలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను సందర్శించారు. కార్యక్రమంలో ఇంచార్జి లైబ్రేరియన్ డాక్టర్ అచలా మునిగల్, డాక్టర్ యాదగిరి, డాక్టర్ చక్రవర్తి, లైబ్రెరీ సిబ్బంది పాల్గొన్నారు.