Contract Lecturers | ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో కాంట్రాక్టు అధ్యాపకులు గత 24 రోజులుగా వివిధ రూపాలలో ఆందోళన చేస్తూ, గత 12 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెను బుధవారం విరమించారు. నిరవధిక సమ్మె 12వ రోజులో భాగంగా ఓయూ పరిపాలన భవనం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ శిబిరం వద్దకు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, ఓ ఎస్ డి ప్రొఫెసర్ జితేందర్ నాయక్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసింతో కూడిన బృందం వచ్చి చర్చించింది.
ఉన్నతాధికారుల సూచన మేరకు తాము చర్చిస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. తక్షణమే నిరవధిక సమ్మెను నిలిపివేయాలని సూచించారు. అనంతరం దీనిపై చర్చించుకున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ ఉద్యమాన్ని, నిరవధిక సమ్మెను తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు ప్రకటించింది. తమ సమ్మె కాలంలో తమకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ సీమర్ల విజేందర్ రెడ్డి, డాక్టర్ పరుశరామ్, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ వేల్పుల కుమార్, డాక్టర్ తాళపల్లి వెంకటేష్, డాక్టర్ ఓ. కృష్ణయ్య, డాక్టర్ చెన్న గౌడ్, డాక్టర్ రేష్మా రెడ్డి, డాక్టర్ కవిత, డాక్టర్ వినీతపాండే, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.