OU Colleges | ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (టీపీడీపీజీఎంఏ) రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. తమకు రావలసిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, లేనిపక్షంలో వచ్చే నెలలో నిర్వహించబోయే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించబోమని హెచ్చరించింది. ఈ మేరకు ఓయూ అధికారులకు అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. తమకు నాలుగేళ్లుగా ఫీజు బకాయిలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయవద్దని, ఆర్టిఎఫ్ ద్వారా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని గతంలో చెప్పారని గుర్తు చేశారు. దానిని అనుసరించి విద్యార్థులకు ఉత్తమ బోధన గావిస్తూ అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తాము బతుకుతూ తమతోపాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న యాజమాన్యాలు ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని వివరించారు. భవన యజమానుల అద్దె వేధింపులు, వేతనాల కొరకై ఉద్యోగుల ఒత్తిడి, వారి సహాయ నిరాకరణ ఇవన్నీ కాకుండా రోజువారి ఖర్చులకు మరింత సొమ్ము అవసరం పడడంతో ఎంతో కష్టపడాల్సి వస్తుందని చెప్పారు.
గతేడాది మార్చి నుంచి ఎన్నో పర్యాయాలు అధికారులు, నాయకులకు తమ గూడు వెళ్ళబోసుకున్నప్పటికీ ఫలితం రాలేదని చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో దసరా సెలవుల అనంతరం (అక్టోబరు 14 నుంచి) యాజమాన్యాలు కళాశాలలను తెరవలేకపోయారని పేర్కొన్నారు. దాంతో 17న పేరుకు కొన్ని బకాయిలను విడుదల చేశారని అన్నారు. కనీసం 20 శాతం బకాయిలు కూడా విడుదల చేయకుండా కళాశాలలు ఎలా నడపాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే నెల 8వ తేదీ నుంచి నిర్వహించబోయే డిగ్రీ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను నిర్వహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సీతారాంరెడ్డి, జనరల్ సెక్రెటరీ నరసింహ యాదవ్, నాయకులు పరమేశ్వర్, నాగయ్య, రామారావు, రమేష్ గౌడ్, రామ్ రెడ్డి, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు