ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 18: ఆస్ట్రేలియాలోని మార్డోక్ యూనివర్సిటీతో ఓయూ అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నది. జెనెటిక్స్, బయోటెక్నాలజీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ఉమ్మడి పరిశోధనలు చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. ఈ మేరకు ఓయూ సెంట్రల్ ఫెసిలిటీస్ ఫర్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (సీఎఫ్ఆర్డీ) డైరెక్టర్, జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ స్మితా పవార్, మార్డోక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వీసీ ప్రొఫెసర్ కెల్లీ స్మిత్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీస్ ఇంటర్నేషనల్ చైర్, స్టేట్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ సెంటర్ ఫుడ్ ఫ్యూచర్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజీవ్ వర్ష్నే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. విద్య, పరిశోధనల్లో విదేశీ వర్సిటీలతో వ్యూహాత్మక భాగస్వామ్యం, పరస్పర ఆలోచనల మార్పిడికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ స్మితా పవార్ పేర్కొన్నారు.