హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): కింది నుంచి చూస్తే మేఘాలను అంటుకొంటున్నట్టు కనిపించే భవనం అది.. నీలి రంగులో కనిపిస్తున్న ఆకాశ హర్మ్యం అది.. చుట్టూ ఏ భవనానికీ అందనంత ఎత్తున వెలసిన మహాశిఖరం అది.. చూడగానే వహ్వా! అనిపించే అద్భుత సౌధం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)ను చూసి యావత్తు దేశం కండ్లింత చేసుకొని చూస్తున్నది. ఏ ఇద్దరు కలిసినా.. గురువారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ భవనం గురించే మాట్లాడుకొంటున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ర్టాల వ్యాపారులు సీసీసీ గొప్పతనాన్ని తమవాళ్లకు చెప్తున్నారు. వాళ్లలో వాళ్లే ‘ఇలాంటిది మన దగ్గరా ఉంటే బాగుండు’ అని అనుకోవటం విశేషం.
ఇలా పోలీస్ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటే ప్రశాంతమైన జీవనంతో పాటు, వ్యాపారాలు కూడా సాఫీగా సాగుతాయని గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు, ఉద్యోగులు సోషల్మీడియాలో చర్చించుకొంటున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 నుంచి వెళ్తున్నవారు సీసీసీ వద్ద ఆగి ఫొటోలు దిగి, వాట్సాప్ డీపీలుగా, స్టేటస్లుగా పెట్టుకొంటున్నారు. అందులో ఎక్కువ మంది ఇతర రాష్ర్టాల వ్యాపారులే ఉన్నారు. సొంత రాష్ట్రంలో ఉన్న తమ బంధువులకు, స్నేహితులకు సీసీసీ ఫొటోలను షేర్ చేస్తూ, దాని విశేషాలను వివరిస్తున్నారు.