Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసుల రాజ్యం కొనసాగుతోంది. విద్యార్థులు నిద్ర నుంచి మేల్కొనక ముందే హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి బలవంతంగా ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు నిరాటంకంగా తరలిస్తున్నారు. తాజాగా బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో గవర్నర్ ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. ఓయూలో వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ ప్రజాస్వామ్య వాతావరణాన్ని సమాధి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నట్లుగా ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ప్రజాపాలన, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఏడో గ్యారెంటీ అని చెప్పి ఓయూను పోలీసు రాజ్యంగా మార్చి విద్యార్థుల స్వేచ్ఛ, హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూలో ఎలాంటి ఆందోళనలు చేయకూడదంటూ ఈనెల 13న జారీ చేసిన ఏకపక్ష, నియంతృత్వ సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని పది రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న ఇప్పటికీ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు.
పైగా విద్యార్థుల హాస్టల్ లోకి, తరగతి గదుల్లోకి, లైబ్రరీ లోకి పోలీసులకు అనుమతి ఇచ్చి అరెస్టులు చేపించడం దారుణం అన్నారు. ఈ విషయాలను వర్సిటీ ఛాన్స్లర్ అయిన గవర్నర్‌కు విన్నవించుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమని వాపోయారు. విద్యార్థులు లేవకముందే హాస్టల్ గదుల్లోకి వచ్చి వారిని బెదిరించి అరెస్టు చేస్తే అది ముమ్మాటికీ పోలీసు రాజ్యమేనని అన్నారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా పోయిలో ఇప్పుడు నడిచేది పోలీసుల రాజ్యమేనని ఉద్ఘాటించారు.