Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని 2018 బ్యాచ్ పీహెచ్డీ విద్యార్థుల థీసెస్ సమర్పణ గడువును పొడగించాలని డిమాండ్ చేస్తూ పరిశోధక విద్యార్థులు ఓయూ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం రిజిస్ట్రార్ కార్యాలయంలో ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2018లో ప్రారంభమై 2019 వరకు సాగిందని గుర్తు చేశారు. ప్రవేశాలు పొందిన మరుసటి సంవత్సరమే కరోనాతో రెండేళ్ల విలువైన సమయం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రీ పీహెచ్డీ పరీక్షను 2021లో నిర్వహించారని చెప్పారు. ఫెలోషిప్లు లేకపోవడంతో తమ పరిశోధనను సకాలంలో పూర్తి చేయలేకపోయామని పేర్కొన్నారు. డెడ్లైన్ పేరుతో నిరుపేద, గ్రామీణ పేద విద్యార్థులను మానసికంగా కృంగిపోయేలా చేయొద్దని కోరారు. సంవత్సరం పాటు తమకు గడువు పొడగించాలని విజ్ఞప్తి చేశారు. యూజీసీ నిబంధనల మేరకు తాము కోల్పోయిన విలువైన కరోనా సమయాన్ని తమకు పొడిగించాలని డిమాండ్ చేశారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ధర్నాను విరమించబోమని చెప్పారు.
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, ఓఎస్డి ప్రొఫెసర్ జితేందర్ నాయక్ పలుమార్లు వీసీతో ఫోన్లో సంప్రదించారు. ఈనెల 28వ తేదీ లోపు స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిశోధక విద్యార్థులు ధర్నాను విరమించారు.
ఈ కార్యక్రమంలో పరిశోధక విద్యార్థులు కొమ్ము శేఖర్, జీడి అనీల్ కుమార్, జంగిలి దర్శన్, వలిగొండ నరసింహ, క్రాంతి నాయక్, ఆదివాసీ అరుణ్, మేడి కార్తీక్, క్రాంతిరాజు, పెద్దమ్మ రమేష్, నాగరాజు, తప్పెట్ల ప్రవీణ్, సూర్యం, మేకల రవి, సుధీర్ కుమార్, అలేఖ్య, వాణి, కళ్యాణి, నాగమ్మ, సాయి భవాని, పద్మ, రీతి, రజిత, జ్యోతి, కృష్ణవేణి, రమేష్, శివ, లక్ష్మణ్, సందీప్, చందు, విజయ్ కుమార్, ప్రభాకర్, కృష్ణ, రవి, నరేష్, రాజు, వెంకటేష్, మహేష్, హేమ సుందర్, కరుణాకర్, సతీష్, నాగేశ్వర్ రావు, శివరాజు, ధనరాజు, శ్రీ యాదవ్, పరమేష్, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.