హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : విద్యార్థి సేవల ఫీజులను ఉస్మానియా యూనివర్సిటీ భారీగా పెంచింది. విద్యార్థులపై మోయలేని భారాన్ని మోపింది. అకాడమిక్ సేవా రుసుములను 20 నుంచి 100% వరకు వడ్డించింది. పెంచిన ఫీజులు 2026-27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయని వర్సిటీ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ ఫీజుల పెంపును విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పెంచిన ఫీజులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. వర్సిటీ కండోనేషన్ ఫీజు(యూజీ, పీజీ కోర్సులకు) రూ. 500 ఉండగా, తాజాగా వెయ్యికి పెంచింది. అంటే ఈ ఒక్క ఫీజునే 100% పెంచింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, ఎడ్యుకేషన్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల కండోనేషన్ ఫీజులను రూ. 2వేల నుంచి రూ. 3వేలకు పెంచింది.
సహజంగా హాజరు తక్కువగా ఉన్న విద్యార్థుల నుంచి ఈ కండోనేషన్ ఫీజులు తీసుకుని సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తారు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఏబీవీపీ స్టేట్ మీడియా కన్వీనర్ ద్రుహన్ ఖండించారు. వర్సిటీ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు భారాన్ని విద్యార్థులపైకి నెడుతున్నదని విమర్శించారు. బడ్జెట్ నుంచి బ్లాక్గ్రాంట్ మంజూరు చేయించుకోవాల్సి ఉండగా, ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అకాడమిక్ సేవల ఫీజులు పెంచడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఇదే విషయంపై ఓయూ రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. ఒకటి, రెండేండ్లకోసారి ఫీజులు సమీక్షించి సవరిస్తామని, తాజా పెంపు ఈ ప్రక్రియకు చెందినదేనని వెల్లడించారు.
ఫీజుల పెంపు ఇలా..