ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 23: ఉస్మానియా యూనివర్సిటీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పుప్పొడి స్వరూపంలోని సంక్లిష్టమైన అందాన్ని వస్త్రరూపకల్పనలో పొందుపరిచి ‘పరాగమంజరి’అనే నూతన వస్త్ర కళారూపానికి ఓయూ బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అల్లం విజయభాస్కర్‌రెడ్డి, విద్యార్థిని శివాని జీవం పోశారు. సాధారణంగా పుప్పొడి రేణువులు కంటికి కనిపించవు. వాటిని మైక్రోస్కోప్ ద్వారా చూస్తే అత్యంత అలంకరించబడిన నిర్మాణాలుగా కనిపిస్తాయి. ఆ డిజైన్లతో వస్ర్తాలను రూపొందించారు. ఎమ్మెస్సీ ప్రాజెక్టులో భాగంగా శివాని ఈ వినూత్న డిజైన్‌ను డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డి పర్యవేక్షణలో రూపొందించింది. దీనికి పేటెంట్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. వారిని పలువురు అధికారులు, అధ్యాపకులు అభినందించారు.