Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : పునరుత్పాదక విద్యలో ఉస్మానియా యూనివర్సిటీకి ప్రతిష్టాత్మక ఏసీఈ అవార్డు వరించింది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ (ICEF) ప్రత్యేక అందించే ఈ అవార్డును 2025 సంవత్సరానికి గాను ఓయూకు ప్రకటించారు. వనరులను పునర్వినియోగం చేసుకోవటం ద్వారా ఓయూ ఈ అవార్డును కైవసం చేసుకుంది. పునరుత్పాదనలో అభ్యాస పాఠ్యాంశాల రూపకల్పన, అంతర్గత అధ్యయనాలు, సమగ్ర సర్క్యులర్ ఎకానమీ పరంగా విశ్వవిద్యాలయం చేపట్టిన వినూత్న ప్రయత్నాలను ICEF ప్రత్యేకంగా ప్రశంసించింది.
ఈ సందర్భంగా ఓయూ బయో డైవర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసులును వర్సిటీ ఉన్నతాధికారులు అభినందించారు. ప్రతి రోజూ రెండు టన్నుల ఆహార వ్యర్థాలను ఓయూలో బయో గ్యాస్‌గా మార్చి, లేడీస్ హాస్టల్‌కు గ్యాస్ అందిస్తున్నారు. ఇదే సమయంలో వెలువడే బయోస్లరీ వర్ధక ఎరువును విశ్వవిద్యాలయ గార్డెన్లలో వినియోగిస్తున్నారు. ఈ బయో గ్యాస్ ప్లాంట్‌ను కేపీఎంజీ, సాహస్, ఏఈఎస్ సౌజన్యంతో ఓయూలో ఏర్పాటు చేశారు. ఈనెల 31న గురుగావ్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయనున్నారు.