Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ 108వ ఆవిర్భావ దినోత్సవానికి వర్సిటీ సిద్ధమైంది. ఈ నెల 26న జరగనున్న ఆవిర్భావ వేడుకలకు ప్రారంభ సూచికగా ఫౌండేషన్ డే వాక్‌ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి ఇంజినీరింగ్ కళాశాల వరకు రెండు కిలోమీటర్ల మేర జరిగిన ఈ వాక్‌లో ఓయూ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వాక్‌ను ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఠాగూర్ ఆడిటోరియంలో శనివారం జరిగే ఓయూ 108వ ఆవిర్భావ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓయూ సాధించిన విజయాలను వివరించారు. ఓయూ ఔన్నత్యం, వారసత్వాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. వాక్ ముగిసిన అనంతరం ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పించారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.